జగన్…ఇదేనా నీ సభ్యత..?

సామాన్యుడు టివి వార్త:
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
* చంద్రబాబు, లోకేశ్ ను చూసి హుందాగా వ్యవహరించడం నేర్చుకో
* వైసీపీ పాలనలో ఎన్నో హత్యలు
* వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన అభాగ్యులు
* వారందరినీ ఆనాడెందు పరామర్శించ లేదు..?
* శవ రాజకీయాలు నీకు అలవాటే…
* తండ్రి, చిన్నాన్న శవాలతో రాజకీయాలు చేశావ్
* పోలీసులను తిట్టడానికే పాపిరెడ్డిపల్లి వచ్చావా..?
* వారే లేకుంటే తిరిగి ఇంటికి వెళ్లేవాడివా..?
* జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం

పెనుకొండ : బాధ్యతగా వ్యవహరించాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగజారుడు మాటలు మాట్లాడడం బాధాకరమని పోలీసుల బట్టలు ఊడదీసి కొడతామనడం ఎంతవరకు సబబు అని, భావి తరాలకు ఆయన ఏమి చెప్పదలచుకున్నారని, ఇదేనా నీ సభ్యత అని జగన్ ను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి మంత్రి సవిత ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టడానికి, మీ ఉనికిని చాటుకోడానికి పాపిరెడ్డిపల్లికి వచ్చారన్న అందరికీ తెలుసన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడారు. జగన్ పాలనను చూసి వైసీపీని 11 సీట్లకు ప్రజలు పరిమితం చేశారని, అధికారంలో 30 ఏళ్లు అధికారంలో ఉంటామని కలలుగన్నారని, ఆ కలలు కల్లలు కావడంతో ఆయన కు మతిభ్రమించిందని మంత్రి ఎద్దేవా చేశారు. మీరు హుందా వ్యవహరిస్తూ, తగిన సలహాలు సూచనలు అందజేస్తే పరిశీలిస్తామన్నారు. అంతేగాని, ప్రజలను రెచ్చెగొట్టేలా, వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు.

జగన్ కు శవ రాజకీయాలు అలవాటే…

ముందు నుంచీ జగన్ కు శవ రాజకీయాలు అలవాటుగా మారాయని మంత్రి సవిత అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం ఘటనను కూడా రాజకీయానికి వాడుకున్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వైఎస్ మృతి చెందిన ప్రాంతానికిగాని, మృతదేహాన్ని తీసుకొచ్చిన సమయంలోకి కర్నూలుకు గాని, ఎయిర్ పోర్టు కు తీసుకొచ్చినప్పుడుగాని జగన్ అక్కడికి రాలేదన్నారు. తండ్రిలేని వాడనంటూ హైదరాబాద్ లో ఉండి సీఎం కావడానికి శవ రాజకీయాలకు తెర తీశారన్నారు. తరవాత చిన్నాన్న వైఎస్ వివేకానంద హత్య ఘటనను కూడా రాజకీయం చేసుకుని లబ్ధిపొందారన్నారు. జగన్ కు శవ రాజకీయాలు అలవాటుగా మారాయన్నారు.

ఆనాడు ఎందుకు పరామర్శించలేదు..?

సీఎం జగన్ గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎందరో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారెందరో హత్యలకు గురయ్యారని, మరెందరో అమాయకులు వేధింపులు తాళలేక బలవన్మరణాలకు పాల్పడ్డారని మంత్రి సవిత తెలిపారు. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన తమ్ముడిని పెట్రోల్ వేసి తగుల బెట్టారన్నారు. కర్నూలులో వైసీపీ దౌర్జన్యాలను తాళలేక ఓ కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మీ పాలనలో కురుబ అలివేలమ్మను జుట్టు కత్తిరించి, వైసీపీ నాయకులు కొట్టి కొట్టి ఇబ్బందులు పెట్టారని, కురుబ అక్కులప్ప, కురుబ నాగరాజును ఇళ్ల నుంచి బయటకురాకుండా ఎంతగానో వేధించారని అన్నారు. బిత్తపల్లి మండల పత్యాపురం గ్రామంలో రాజు అనే వ్యక్తిని వైసీపీ గూండాలు కిరాతకంగా చంపేశారన్నారు. మిల్క్ డెయిరీ డీడీ కురుబ శ్రీనివాసులపై తప్పుడు కేసులు పెట్టించి…వేధించి ఆయన మరణానికి అప్పటి వైసీపీ నాయకులు కారణమయ్యారన్నారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన ఎండీ నాగభూషణంను ఉద్యోగం నుంచి వెళ్లిపోయేలా మానసిక వేదనకు గురిచేశారన్నారు. వారెవరినీ ఆనాడు ఎందుకు పరామర్శించలేదని జగన్ ను మంత్రి సవిత ప్రశ్నించారు. ఆనాడు కురుబలకు ఎంతో అన్యాయం జరుగుతున్నా ఏనాడూ స్థానిక వైసీపీ నాయకులుగాని, కురుబ సంఘ నాయకులుగాని ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. తామ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల గురించి పోరాడతామన్నారు.

పోలీసులే లేకుంటే తిరిగి వెళ్లేవాడివా..?

2014-19 మధ్య జగన్ పాదయాత్రకు పోలీసులే భద్రత కల్పించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆనాడు పోలీసులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి జగన్ కు రక్షణ కల్సించారన్నారు. 2019-24లో పోలీసులకు ఇష్టం లేకపోయినా వారి మెడపై కత్తిపెట్టి రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయించుకున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోయాక, పోలీసులు తమ విధులు నిర్వహిస్తుంటే, వారిపై అసభ్యకరంగా మాట్లాడడం సరికాదని, సంస్కారం నేర్చుకోవాలని జగన్ కు హితబోధ చేశారు. పాపిరెడ్డిపల్లి నుంచి జగన్ ఇంటికి వెళ్లడానికి కూడా పోలీసుల రక్షణే అవసరమైందన్న విషయం కూడా గుర్తించుకోవాలని అన్నారు. పరామర్శకు వచ్చారా… పోలీసులను తిట్టడానికి వచ్చారా..? అని జగన్ ను మంత్రి సవిత ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేశ్ ను చూసి నేర్చుకో..

అయిదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా సీఎం చంద్రబాబునాయుడు ఎంతో హుందాగా వ్యవహరించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజావేదిక కూల్చినప్పుడుగాని, అనపర్తిలో ఆరు కిలోమీటర్లు నడిపించినప్పుడుగాని, రాజకీయ హత్యలు జరిగినప్పుడుగాని ఎంతో హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. మంత్రి నారా లోకేశ్ ను యువగళం పాదయాత్రలో అడగడుగునా అడ్డుకున్నారన్నారు. మైక్ ఇవ్వకుండా, నిలబడనీయకుండా చేశారన్నారు. ఆరోజు లోకేశ్ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేశ్ లను చూసి హుందాగా ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని జగన్ కు మంత్రి సవిత హితవు పలికారు.

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

పాపిరెడ్డి పల్లిలో జరిగిన ఘటన బాధాకరమని మంత్రి సవిత ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఘటనలో బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారెంత స్థాయి వ్యక్తులైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. సీఎం చంద్రబాబు సైతం తక్షణమే స్పందిస్తూ, బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ భరోసానిస్తున్నారన్నారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Scroll to Top