అమరావతి, ఏప్రిల్ 16:రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఈరోజు (బుధవారం) సచివాలయంలో ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. నేడు మీరు సాయం చేసి నిలబెడితే… రేపు దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామనిచెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలని… స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతం ఇవ్వాలన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘాన్ సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 తిరిగి ప్రారంభించామని ముఖ్యమంత్రి చెప్పారు.
సచివాలయంలో 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పురోగతిపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు సీఎం. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వివరిస్తూ వీడియో ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్‌కు ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించింది. దీనిపై ప్రధానికి వివరించారా అని 16 ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఫోటో ఎగ్జిబిషన్‌లో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్, బనకచర్ల ప్రాజెక్ట్ అంశాలను ఉంచారు. అలాగే అమరావతి నిర్మాణంపై వీడియో ప్రజంటేషన్‌ను 16వ ఆర్థిక సంఘానికి చూపించారు. ఆపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఏ విధంగా దిగజారింది, ఏ విధంగా రాష్ట్రానికి 16వ సంఘం సాయం చేయాల్సి ఉంది అనే విషయాన్ని సీఎం వివరించారు. అలాగే కేంద్రం ఇచ్చే సాయం మరింత పెంచేలా సిఫార్సులు చేయాలని కోరారు.
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వారికి సీఎం వివరించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై కూడా ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు, చైర్మన్‌కు స్పెషన్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి లోకేష్ ఈ పాల్గొన్నారు.