* సీఎం ఆదేశాలతో బాధిత కుటుంబానికి అందిన పరిహారం.
* వీధి కుక్కల సంతతి పెరగకుండా పకడ్బందీగా స్టెరిలైజేషన్.
* ముందు జాగ్రత్త చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.
అమరావతి : గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు. బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం 4 నెలల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల వీధి కుక్కలు ఉండగా, అందులో 2.03 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేసేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీని తక్షణం చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుంటూరు తరహా ఘటనలు మళ్లీ తలెత్తకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.