ఏకంగా 98 వేలకు చేరీన బంగారం

ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వాణిజ్య మార్పులు భారత మార్కెట్‌పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధరలు రూ.1,650 పెరిగి 10 గ్రాములకు రూ.98,100కు చేరాయి. ఇదే సమయంలో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర కూడా రూ.1,650 పెరిగి రూ.97,650 స్థాయికి చేరుకుంది. ఈ ధరలు ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక మంది కూడా సురక్షితమైన బంగారం పెట్టుబడులపైన ఫోకస్ చేస్తున్నారు.

బంగారం ర్యాలీకి ప్రధాన కారణం..

మరోవైపు బుధవారం వెండి ధర కిలోకు రూ.1,900 పెరిగి రూ.99,400కి చేరుకుంది. ఆసియా మార్కెట్లో స్పాట్ సిల్వర్ దాదాపు 2 శాతం పెరిగి ఔన్సుకు USD 32.86కి చేరుకుంది. ఇది కూడా సురక్షిత పెట్టుబడులకు అనుగుణంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా డాలర్ ఇండెక్స్ మూడేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం బంగారం ర్యాలీకి ప్రధాన కారణాల్లో ఒకటని నిపుణులు అంటున్నారు. డాలర్ విలువ పడిపోతే, బంగారం ధర పైపైకి చేరుతుంది. అదనంగా, వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు, ఆర్థిక మందగమనం భయాలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ అనిశ్చితి వంటి అంశాలు కూడా ఈ రేట్లను ప్రభావితం చేస్తున్నాయి.

కొత్త గరిష్టాలకు

ఇంకోవైపు MCXలో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,984 లేదా 2.12 శాతం పెరిగి రూ.95,435 రికార్డు గరిష్టాన్ని తాకాయి. COMEXలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు $3,300 దాటి వెళ్లింది. ఇది ప్రపంచ స్థాయిలో బంగారంపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి చూపిస్తుంది. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇప్పుడు బంగారాన్ని ‘సురక్షిత స్వర్గం’గా తిరిగి ఆదరిస్తున్నారు. అయితే అమెరికా, చైనా మధ్య సుంకాలపై చర్చలు ఇంకా తగ్గడం లేదు. అధ్యక్షుడు ట్రంప్ కీలకమైన ఖనిజాలపై సుంకాలు విధించే ప్రకటన, చైనా వస్తువులపై 245 శాతం వరకు సుంకాల పెంపు, అన్ని అంశాలు కూడా బంగారం ధరలను మరింత పెరిగేలా చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Scroll to Top