రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు–మంత్రిఅనగాని

అమరావతి:

ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే స్లాట్ బుక్ చేసుకుని వెళ్లే సదుపాయాన్ని ఇవాళ ప్రారంభించింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇవాళ ఈ సదుపాయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రిజిస్ట్రేషన్ దారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ర్టేషన్ కోసం స్లాట్ బుకింగ్ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్లాట్ బుకింగ్ అవగాహన కరప్రతాన్ని, పోస్టర్ ను మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రజలకు సులభతరంగా సేవలు అందించాలనే సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

 

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారిక వెబ్ సైట్ లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకునేలా స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. దీని ద్వారా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్ష్యులు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలకు తమకు కుదిరిన సమయాల్లో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చన్నారు. స్లాట్ ఆధారిత అపాయింట్మెంట్లు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తాయన్నారు. ఈ రోజున మొత్తం 26 జిల్లా ప్రధాన కార్యాలయాల రిజిస్ర్టార్ కార్యాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని, మొత్తం 296 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ దశలవారీగా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే గాంధీనగర్, కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేశామని, ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా అన్లైన్ లో డేటా ఎంట్రీ చేసి డాక్యుమెంట్ ప్రీపేర్ చేసుకొని ఫీజు కూడా కట్టేసి ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చిన 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుందన్నారు.

ఒక వేళ స్లాట్ బుకింగ్ చేసుకోలేకపోయిన వారు సబ్ రిజిస్టార్ ఆఫీసుకు వస్తే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కూడా రూ.ఐదు వేల రూపాయల ప్రత్యేక ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఉగాది,రంజాన్ పండుగల సందర్భంగా వరుసగా వచ్చిన మూడు రోజుల సెలవుల్లో దాదాపు రూ.74 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ ఆదాయం లభించిందన్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఆటోమ్యూటేషన్ను సులభతరం చేయడం కోసం రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ ను రెవెన్యూ డేటాబేస్ తో అనుసంధానం చేశామన్నారు.


Scroll to Top