అమరావతి, సామాన్యుడు టివి వార్త: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి తనకేమీ గుర్తులేదని పోలీసులకు చెప్పిన డాక్టర్ ప్రభావతి ఆమెకు గతం గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని భావిస్తున్నట్టు రఘురామ వ్యాఖ్యలు కస్టోడియల్ టార్చర్ కేసులో తనకేమీ గుర్తులేదని వైద్యురాలు ప్రభావతి పోలీసు విచారణలో చెప్పడంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైద్యులు ఇచ్చిన నివేదికపై సంతకం చేశానని, గాయాల గురించి తనకు అవగాహన లేదని డాక్టర్ ప్రభావతి చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఎంబీబీఎస్ చేసిన ఎవరికైనా కనీస అవగాహన ఉంటుందన్న విషయం ఆమె ఎలా మరిచిపోయారో తెలియదన్నారు. ఆమెకు గతం గుర్తుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతాయని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కోర్టులు మన చేతుల్లో ఉండవు కాబట్టి, ఏ తీర్పు వచ్చినా శిరసావహించాలని తెలిపారు. డాక్టర్ ప్రభావతి గారికి మళ్లీ జ్ఞాపకశక్తి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కొన్ని సినిమాల్లో గతం మర్చిపోయిన వాళ్లకు ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే గతం గుర్తుకు వస్తుందని రఘురామ పేర్కొన్నారు. నిజజీవితంలో ప్రభావతి గారికి ఆ సీన్ రిపీట్ అవ్వాలని, ఆమె మామూలు మనిషి అవ్వాలని, ఎంబీబీఎస్ లో చదివిందంతా మళ్లీ గుర్తుకు రావాలని భగవంతుడ్ని ప్రార్థించడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 15వ తారీఖు వరకు చూద్దాం… ఏం జరుగుతుందో అని అన్నారు.
