న‌ర్సింగ్ విద్య‌ను గాడిలో పెట్టేందుకు ప‌లు నిర్ణ‌యాలు, కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశాలు…ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మొద‌లు…దేశంలోనే మొద‌టిసారి :మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

అమరావతి, సామాన్యుడు టివి వార్త: *ప్ర‌స్తుత న‌వంబ‌రు ప్ర‌వేశాల స్థానంలో జులైలోనే ప్ర‌వేశాలు
న‌ర్సింగ్ విద్య నాణ్య‌త‌పై అల‌స‌త్వాన్ని స‌హించ‌మని స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌* న‌ర్సింగ్ కాలేజీల ప్ర‌తినిధుల‌తో మూడు గంట‌ల‌కు పైగా చ‌ర్చ‌లు 20 ఏళ్ల త‌ర్వాత స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించినందుకు ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలిపిన అసోసియేష‌న్‌ రాష్ట్రంలో న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ మ‌రియు విద్యా నాణ్య‌త ప్ర‌క్షాళ‌న‌పై దృష్టి సారించిన కూట‌మి ప్ర‌భుత్వం న‌ర్సింగ్ విద్యా వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టేందుకు ప‌లు నిర్ణ‌యాల్ని తీసుకుంది. న‌ర్సింగ్ కాలేజీల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ తో గురువారం నాడు మూడు గంట‌ల‌కు పైగా ప‌లు అంశాల‌పై డాక్ట‌ర్ ఎన్టీయార్ వైద్య విశ్వ విద్యాల‌యంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా న‌ర్సింగ్ విద్యా రంగాన్ని మెరుగుప‌ర్చేందుకు ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. న‌ర్సింగ్ కాలేజీల ప్ర‌తినిధులు ప్ర‌స్తావించిన ప‌లు స‌మ‌స్య‌ల‌కు ఈ స‌మావేశంలో ప‌రిష్కారాలు క‌నుగొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి న‌ర్సింగ్ కాలేజీల ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొని ప‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాల‌ను కోరారు.

వివిధ కార‌ణాల వ‌ల్ల ప్ర‌తి ఏడాదీ న‌వంబ‌రులో జ‌రుగుతున్న ప్ర‌వేశాల‌కు చ‌ర‌మ‌గీతం పాడి జులై నాటికి ప్ర‌వేశాల ప్ర‌క్రియను పూర్తి చేయాలని స‌మావేశంలో నిర్ణ‌యించారు. న‌ర్సింగ్ కాలేజీలు ప్ర‌స్తుతం ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల్ని ఈ నిర్ణ‌యం ప‌రిష్క‌రిస్తుందంటూ అసోసియేష‌న్ స్వాగ‌తించింది. 2025-26 విద్యా సంవ‌త్స‌రంలో న‌ర్సింగ్ కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప‌రీక్షను ప్ర‌తి ఏడాదీ జూన్ రెండో వారంలో నిర్వ‌హించాల‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాల‌యం అధికారుల్ని ఆదేశించారు. ఈ మేర‌కు ప్ర‌వేశాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌ను ఏప్రిల్ లో మొద‌లు పెట్టి జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో బియ‌స్సీ (న‌ర్సింగ్‌) కోర్సుల్ని అందించే కాలేజీల్లో ప్ర‌తి ఏటా దాదాపు 13,000 ప్ర‌వేశాలు జ‌రుగుతాయి. ఇట్టి ప్ర‌వేశాల‌కు కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించ‌డం మొద‌టి సారిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో జ‌రుగ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే నీట్‌, రాష్ట్రాల స్థాయిలో జ‌రిగే ఎంసెట్ వంటి పోటీ ప‌రీక్ష‌ల ద్వారా న‌ర్సింగ్ విద్య‌లో ప్ర‌వేశాలు చేస్తున్నారు. ప‌లు రాష్ట్రాల్లో ఇంట‌ర్మీడియ‌ట్ మార్కులాధారంగా ప్ర‌వేశాలు జ‌రుగుతున్నా అది న‌ర్సింగ్ విద్య చ‌దివే వారి ప్ర‌యోజ‌నాల‌కు అవ‌రోధంగా మారుతుంద‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ వివ‌రించారు. బైపిసి గ్రూపుతో ఇంట‌ర్ లో ఉత్తీర్ణుల‌య్యే విద్యార్థులు ఆన్ లైన్ లో నిర్వ‌హించే కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది.

జిఎన్ ఎం న‌ర్సింగ్ కోర్సుల్లో కూడా ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా అడ్మిష‌న్లు చేప‌ట్టేందుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన బోర్డ్ ఆఫ్ ఎక్జామినేష‌న్స్ ను ఏర్పాటు చేయాల‌న్న సూచ‌న‌ను మంత్రి అంగీక‌రించి త‌గు చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల‌ని ఆదేశాలిచ్చారు.

మూడేళ్ల వ్య‌వ‌ధితో కూడిన జిఎన్ ఎం న‌ర్సింగ్ కోర్సుల‌కు వార్షిక బోధ‌నా రుసుం రూ.15,000, నాలుగేళ్ల పాటు సాగే బియ‌స్సీ(న‌ర్సింగ్‌) కోర్సుల‌కు రూ.19,000 గా మాత్ర‌మే నిర్ధారించ‌డం వ‌ల్ల నాణ్య‌మైన న‌ర్సింగ్ విద్య‌ను అందించ‌డంలో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం బోధ‌నా రుసుంను నిర్ధారించ‌డానికి అనుస‌రిస్తున్న విధివిధానాల్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి వాస్త‌విక ద్రుక్ఫ‌ధంతో ఈ విష‌యాన్ని పునఃస‌మీక్షించాల‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ అధికారుల్ని ఆదేశించారు.

న‌ర్సింగ్ కాలేజీల ఏర్పాటు, వాటి నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయా ప్ర‌భుత్వాలు 52 జీఓల‌ను విడుద‌ల చేశాయ‌ని, దీని ఫ‌లితంగా ప‌ర‌స్ప‌ర వైరుధ్యాల‌తో కూడిన ప‌లు జీఓల వ‌ల్ల గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని, వీట‌న్నిటినీ ప‌రిశీలించి సుల‌భ‌త‌ర దిశానిర్దేశం చేసే ఒక స‌మ‌గ్ర జీఓను రూపొందించాల‌ని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు కోరారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించిన మంత్రి మూడు నెలల్లో జులై మాసంలో స‌మ‌గ్ర జీఓను రూపొందించేలా త‌క్ష‌ణ చ‌ర్య‌ల్ని తీసుకోవాల‌ని మంత్రి ఆదేశించారు.

న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు, వాటి నిర్వ‌హ‌ణ‌ల‌పై ప‌లు ఫిర్యాదులొచ్చిన నేప‌థ్యంలో ఆయా విద్యా సంస్థ‌ల ప‌త్రాల ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైన అంశాల‌పై మంత్రి ఆందోళన వ్య‌క్తం చేశారు. విద్యా సంస్థ‌ల ఏర్పాటుకు ప్ర‌భుత్వం జారీ చేసే నిర‌భ్యంత‌ర స‌ర్టిఫికెట్, కాలేజీలు నిర్వ‌హించే ట్ర‌స్టు/ సొసైటీల ఏర్పాటుకు సంబంధించిన ప‌త్రాలు,
స్వంత భ‌వ‌నాల ల‌భ్య‌త‌, నియ‌మాల మేర‌కు పేరెంట్ ఆసుప‌త్రుల ల‌భ్య‌త వంటి అంశాల‌కు సంబంధించిన ప‌త్రాల్ని అధిక మోతాదులో ఆయా సంస్థ‌లు స‌మ‌ర్పించ‌ని వైనాన్ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. న‌ర్సింగ్ విద్యా సంస్థ‌ల ఏర్పాటు, నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంపై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీకి అవ‌కాశంలేద‌ని, ఈ విష‌యాల్లో ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్యవ‌హ‌రిస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. నిర్ధారించిన ఫీజుల కంటే ఎక్కువ‌గా వ‌సూలు చేయ‌డం, ప‌లు ర‌కాలైన ఒత్తిళ్ల ద్వారా విద్యార్ధుల నుంచి డ‌బ్బు వ‌సూలు చేస్తున్నార‌ని కాలేజీ యాజ‌మాన్యాల‌పై ఫిర్యాదులొస్తున్నాయ‌ని, ఈ వైఖ‌రిని మార్చుకోవాల‌ని మంత్రి హెచ్చ‌రించారు.

విద్యా సంవ‌త్స‌రాన్ని న‌వంబ‌రుకు బ‌దులుగా జులైలోనే ప్రారంభించ‌డానికి అంగీకారం కుదిరినందున ఇటీవ‌ల జ‌రిగిన ప‌త్రాల ప‌రిశీల‌న‌లో ప‌లు అంశాల‌కు సంబంధించి వెల్ల‌డైన లోపాల్ని ఆయా సంస్థ‌లు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప్రారంభానికి ముందే స‌వ‌రించుకోవాల‌ని, లేకుంటే ప్ర‌వేశాల‌కు అనుమ‌తించేది లేద‌ని మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు.

20 ఏళ్ల త‌ర్వాత న‌ర్సింగ్ కాలేజీల యాజ‌మాన్యాల‌తో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించేందుకు స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, ప‌లు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారాలు చూపినందుకు న‌ర్సింగ్ కాలేజీల అసోసియేష‌న్ ప్ర‌తినిధులు మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం ఆశ‌యాల మేర‌కు నాణ్య‌మైన న‌ర్సింగ్ విద్య‌ను అందించేందుకు త‌మ వంతు పూర్తి స‌హ‌కారాన్ని అందిస్తామ‌ని వారు హామీ ఇచ్చారు.

ఈ స‌మావేశంలో హైప‌వ‌ర్ క‌మిటీ నూత‌న అధ్య‌క్షులు, మాజీ హైకోర్టు జడ్జి జ‌స్టిస్ యు.దుర్గాప్ర‌సాద‌రావు, డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ‌విద్యాల‌యం ఉప కుల‌ప‌తి మ‌రియు డిఎంఇ డాక్ట‌ర్ న‌ర్సింహం, రిజిస్ట్రార్ డాక్ట‌ర్ రాధికారెడ్డి, రాష్ట్ర న‌ర్సింగ్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీ శ్రీమ‌తి సుశీల‌, హెచ్ పిసి కార్య‌ద‌ర్శి శ్రీమ‌తి వేణిక‌ళ‌, డిఎంఇ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Scroll to Top