*జిల్లా, నియోజకవర్గ కార్యాలయాల ఏర్పాటు కొత్త చరిత్ర
*ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు కేటాయింపు
*26 జిల్లా, 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం
అమరావతి, జూన్ 9 : జిల్లా, నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ఏర్పాటుతో స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయం లేదని…ఇప్పుడు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ల ఏర్పాటుతో ఆ లోటు తీరిందని ముఖ్యమంత్రి అన్నారు. కార్యాలయం ఏర్పాటుతో పాటు 9 మందితో టీమ్ కూడా ఇస్తున్నామని… ఇక విజన్ అమలును తర్వాత స్థాయికి తీసుకువెళ్లాల్సింది మీరేనని ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేలకు ఇది ఒకమంచి అవకాశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల్ని భాగస్వాముల్ని చేయాల్సిందిగా సూచించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులతో విజన్ అమలుపై చర్చించారు. జిల్లా, నియోజకవర్గంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని, ఒక్కో కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
ఎమ్మెల్యే అధ్యక్షుడిగా యాక్షన్ ప్లాన్ యూనిట్
‘నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ యూనిట్‌కు ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మున్సిపాలిటీ / నగర పంచాయతీ ఛైర్మన్, ఆర్డీఓ/సబ్ కలెక్టర్, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రతీ నియోజకవర్గంలో ఇందుకోసం కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యాలయాలు… నియోజకవర్గ ఎమ్మెల్యే-1, జిల్లా నోడల్ ఆఫీసర్–1, అకడెమిషియన్–1, యువ ప్రొఫెషనల్–1, విజన్ స్టాఫ్ (GSWS)–5… ఇలా 9 మంది టీమ్‌తో పనిచేస్తారు.’ అని సీఎం అన్నారు.

వచ్చే 2 ఏళ్లలో 3వ ఆర్ధికవ్యవస్థగా భారత్
‘అధికారం వచ్చిన ఏడాదిలోపే విజన్ రూపొందించుకున్నాం. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు అయ్యే నాటికి ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్-2047’ తీసుకువస్తే, దానికి అనుబంధంగా రాష్ట్రంలో ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ రూపొందించుకున్నాం. మనం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో 4వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ ఇటీవల చేరుకుంది. వచ్చే రెండేళ్లలో 3వ స్థానం చేరుకుంటాం. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులు ఆర్జిస్తున్నారు. అందులో 30 శాతంపైనే తెలుగువారు ఉన్నారు. ఇది కొనసాగించి, మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాల్సి ఉంది.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
10 ప్రధాన సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047
‘పేదరికం లేని సమాజం, ఉద్యోగ కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు-బ్రాండింగ్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్..ఇలా 10 ప్రధాన సూత్రాలతో కార్యాచరణ నిర్దేశించుకున్నాం.’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి
‘వాట్సప్ గవర్నన్స్ ద్వారా 400కి పైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం. వచ్చే 2 నెలల్లో మొత్తం ప్రభుత్వ సేవల్ని మన మిత్రతో పొందవచ్చు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, సచివాలయ స్థాయిల్లో విజన్ అమలు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ’ రాష్ట్రంగా ఉండాలనేది మన అంతిమ లక్ష్యం. రాష్ట్రంతో పాటు 26 జిల్లాలకు విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు సిద్ధం చేశాం. విజన్ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణ, అమలుకు ప్లానింగ్ విభాగం, జీఏడీ, ఐటీఈ &సీ, ఆర్టీజీఎస్, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, ఫైనాన్స్, ఐ&పీఆర్, సీఎంఓ కలిసి పనిచేస్తున్నాయి. 26 జిల్లాలకు గాను 5 ఏళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాం. లక్ష్యాలను సాధించడం కోసం యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్-2047తో పాటు ఈ నాలుగేళ్లలో ఏమి చేస్తాం అనేది ప్లాన్ చేసుకోవాలి. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నాం.
ఆగస్ట్ 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల దత్తత
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కు, అలాగే అమరావతిలో రతన్ టాటా హబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సేవల రంగంపై ఎక్కువ దృష్టి పెడుతున్నాం. ఆదాయం పెరిగితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలం. టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నాం. మానవతా దృక్పధంతో పరిపాలన సాగాలి. తల్లికివందనం ఈ నెలలో ప్రారంభిస్తున్నాం. ఆగస్ట్ 15న ఫ్రీ బస్ ఇస్తాం. దీపం పథకంలో భాగంగా ఇక నుంచి అకౌంట్‌కు నేరుగా డబ్బు జమచేస్తాం. రాష్ట్రం పునర్నిర్మాస్తామని మాట ఇచ్చాం. జీరోపావర్టీ-పీ4 కార్యక్రమం చేపట్టాం. ఆగస్ట్ 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను… మార్గదర్శులు దత్తత తీసుకునేలా ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో రిఫరల్ విధానం తీసుకొచ్చి ఎక్కువ మంది మార్గదర్శులను పరిచయం చేసే అధికారులను అవార్డులు ఇస్తాం.
ప్రధానంగా 10 రంగాల అభివృద్ధి
‘1.వ్యవసాయం, 2.పాడి, మత్స్య & హార్టికల్చర్ రంగాలు, 3.పరిశ్రమలు, వాణిజ్యం, లాజిస్టిక్స్, 4.సేవల రంగం & ఐటి, 5.ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, 6.విద్య & నైపుణ్య అభివృద్ధి, 7.పర్యావరణం & సహజ వనరుల పరిరక్షణ, 8.మౌలిక వసతులు – రోడ్లు, నీటి పథకాలు, ఇల్లు, 9. పట్టణాభివృద్ధి & గ్రామాభివృద్ధి, 10.పాలన సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్…ఇలా 10 రంగాలను ప్రధానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు.
డయాఫ్రమ్ కాపాడకపోవడం వల్లే పోలవరం ఆలస్యం
‘గత ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ పరిరక్షించి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తయ్యేది. అయినా 2027 కల్లా పూర్తిచేస్తాం. అమరావతిని 2028 నాటికి నిర్మిస్తాం. విశాఖను ముంబైలా తీర్చిదిద్దేలా ప్రయత్నిస్తున్నాం. 2026కి భోగాపురం విమానశ్రయం సాకారం అవుతుంది. పోలవరం-బనకచర్ల అనుసంధానం, విశాఖ-విజయవాడలో మెట్రోరైళ్లు, విశాఖ రైల్వే జోన్, పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.
ఏడాదిలోనే ప్రజలకు నమ్మకాన్ని ఇచ్చాం
‘ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. అన్ని వ్యవస్థలను గాడిన పెడుతున్నాం. గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తిరిగి 78 ప్రాజెక్టులను పునరుద్ధరించాం. పరిశ్రమలు పెట్టాలంటే భయపడ్డారు…పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపుతున్నాం. సమస్యలు ఉన్నా ప్రజలకు ఏడాదిలోనే ఒక నమ్మకాన్ని ఇచ్చాం. కేంద్ర సాయాన్ని తీసుకుంటున్నాం. మరింత కష్టపడాల్సి ఉంది. మనకున్న నిధులన్నీ సమీకరించి సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. 15 శాతం వృద్ధి సాధించాలి. దీనికి నిర్దిష్టమైన ప్రణాళికలు అమలు చేస్తాం.’
రామ్మోహన్ నాయుడును అభినందించిన సీఎం
విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు… జీరో పావర్టీ పీ4 కార్యక్రమం కింద 10 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రికి తెలిపారు. రామ్మోహన్ నాయుడుని అభినందించిన ముఖ్యమంత్రి… మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా దత్తత తీసుకుని మార్గదర్శి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.