ఎక్కడ దాకున్నా బయటకు రప్పిస్తాం-మంత్రి సవిత

* వైసీపీ అక్రమార్కులకు మంత్రి సవిత హెచ్చరిక
* వారు దోచుకున్న ప్రతి రూపాయినీ ప్రజలకిస్తాం
* తప్పు చేసినవారే బాతు రూమ్ ల్లో జారిపడుతున్నారు
* జగనో టూరిస్ట్..
* కాంగ్రెస్ పిలుపు కోసం ఎదురు చూపులు…
* అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు : మంత్రి సవిత

పెనుకొండ : అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులు ఎక్కడ దాకున్నా బయటకు తీసుకొస్తామని, వారు దోచుకున్న ప్రతి రూపాయిని స్వాధీనం చేసుకుని, ప్రజలకిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. తప్పు చేయనప్పుడు భయమెందుకని, తమ ప్రభుత్వం ఎప్పుడూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని తెలిపారు.

జగనో టూరిస్ట్ అని, అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. పెనుకొండ పట్టణంలోని గడంగ్ వీధి, కుమ్మరిదొడ్డి కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఇంటింటీకీ వెళ్లి లబ్ధిదారులను స్వయంగా మంత్రి సవిత పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా తనను కలిసి విలేకరులతో ఆమె మాట్లాడారు. మొన్న ఉగాది, నిన్న రంజాన్, ఈరోజు పెన్షన్ల పండగను రాష్ట్రంలో జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షలకు పైగా లబ్ధిదారులకు రూ. 2,717 కోట్లు అందజేస్తున్నామన్నారు. సత్యసాయి జిల్లాలో 2.61 లక్షల మందికి రూ.117 కోట్లు, పెనుకొండ నియోజక వర్గంలో 41 వేల మందికి రూ.17 కోట్లు అందజేస్తున్నామన్నారు.

రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఉధృతంగా చేపడుతున్నారన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వితంతవులు, వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల మేర పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, సీఎం చంద్రబాబునాయుడు పెన్షన్లు అందజేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామన్నారు. త్వరలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయనున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ రైల్వే జోన్ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. త్వరలో టీచర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

పెనుకొండ రూపరేఖలు మారుస్తున్నాం…

అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే పెనుకొండ పట్ణణం రూపు రేఖలు మార్చినట్లు మంత్రి సవిత తెలిపారు. ప్రస్తుతం పెనుకొండ పట్టణంలోనే రూ.5 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేశామని, త్వరలో కోనాపురం, ఇస్లాంపురం రోడ్లను కూడా నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఇటీవలే పెనుకొండ ఆర్చిని అభివృద్ధి చేశామని, త్వరలో పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. పట్టణంలో తాగునీటి కల్పనకు ఇప్పటికే పటిష్ట చర్యలు తీసుకున్నామని మంత్రి సవిత తెలిపారు.

పశువుల సంరక్షణకు పెద్దపీట

ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని పశువుల సంరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే నియోజక వర్గ వ్యాప్తం గోకులం షెడ్లు నిర్మాణాలు ప్రారంభించామన్నారు. దీంతో పాటు పశువులకు నీటి ఎద్దడి రాకుండా ఉండడానికి తాగునీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. స్వచ్ఛాంధలో పెనుకొండ పట్టణాన్ని ప్రథమ స్థానంలో నిలుపుదామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు కూడా సహకరించాలని ఆమె కోరారు.

ఎక్కడ దాక్కున్నా బయటకు రప్పిస్తాం

జగన్ ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులను ఎక్కడ దాక్కున్నా బయటకు రప్పిస్తామని, వారు దోచుకున్న ప్రతి రూపాయిని కూడా స్వాధీనం చేసుకుని ప్రజలకిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. గడిచిన అయిదేళ్లు దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా జగన్ పాలన సాగిందన్నారు. తప్పు చేయకుంటే ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, రెడ్ బుక్ అంటే భయమెందుకని మంత్రి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటోందని స్పష్టంచేశారు. తప్పు చేసిన వారే బాత్ రూమ్ లు జారి పడుతున్నారని, వారికి కాళ్లు విరిగితున్నాయని, కొందరు బొంబాయికి ఫ్లైట్ లో వెళుతున్నారని, మరికొందరు మెంటల్ గా డిస్ట్రబ్ అవుతున్నారని, ఇంకొందరికి బీపీలు, షుగర్లు పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.

జగనో టూరిస్ట్…

జగనో టూరిస్ట్ అని, అప్పుడప్పుడూ రాష్ట్రానికి వచ్చి బెంగుళూరుకు వెళ్లిపోతుంటారని మంత్రి సవిత ఎద్దేశా చేశారు. ఆయన అయిదేళ్ల పాటు కళ్లు మూసుకుని కూర్చోవడం వల్లే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ లో చేరడానికి జగన్ చూస్తున్నారన్నారు. ఆ పార్టీ పిలుపుకోసం ఎదురు చూపులు చూస్తున్నారన్నారు. 2014-19 మధ్య అధికారంలో తమ పార్టీ ఉందని, తరవాత 2019-24 మధ్య ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాటం చేశామన్నారు. ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి కూడా రావడానికి భయపడుతున్నారని, దొంగల్లా వచ్చి వెళుతున్నారని అన్నారు. తామేనాడూ వైసీపీ నాయకులు మాదిరిగా పారిపోలేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top