కురుడి శివాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిషేకార్చనలు

అల్లూరి సీతారామరాజు జిల్లా: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  అరకు నియోజకవర్గం పరిధిలోని కురుడి గ్రామంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కురుడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. గ్రామస్తురాలు శ్రీమతి రాములమ్మ, ఆలయ కమిటీ సభ్యులతో కలసి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అడవితల్లి బాట కార్యక్రమ ప్రారంభోత్సవం సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కలిసిన కురుడి గ్రామ గిరిజనులు తమ ఊరి శివాలయంలో దర్శనం చేసుకుని వెళ్లాలని కోరగా, వస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురిడి గ్రామ అభివృద్ధి నిమిత్తం సొంత నిధుల నుంచి రూ. 5 లక్షలు ప్రకటించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, టూరిజంకి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Scroll to Top