* కెనోపీ వాక్ ప్రారంభించి కాఫీ తోట మధ్య నడచిన ఉప ముఖ్యమంత్రివర్యులు
* ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా రూ.19 లక్షల వ్యయంతో చెక్క వంతెన నిర్మాణం
* కాఫీ, మిరియాల తోటల పెంపకంపై ఆరా
* ట్రీడెక్స్, బర్డ్ నెస్ట్, వృక్ష జాతుల ఎగ్జిబిషన్ సందర్శన
అల్లూరి సీతారామరాజు జిల్లా:ఎకో టూరిజం అభివృద్ధిలో అరకు మండలం, సుంకరమెట్ట కాఫీ ఎస్టేట్స్ లో ఏర్పాటు చేసిన చక్క వంతెనను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు రూ.19 లక్షల అంచనా వ్యయంతో కాఫీ తోటల మధ్య నిర్మించిన చెక్క వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. చెక్క వంతెన ప్రారంభానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ ఆర్.వి. సుజయ కృష్ణ రంగారావు గారితో కలసి కాఫీ తోటల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొక్కలు నాటారు. అనంతరం కాఫీ తోటల మధ్య ఆ వంతెనపై కెనోపీ వాక్ ప్రారంభించారు. ఉడెన్ బ్రిడ్జ్ పై నడుస్తూ ఆద్యంతం కాఫీ తోటల వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిల్వర్ ఓక్ చెట్ల మధ్య వేసిన కాఫీ మొక్కలు, ఎత్తయిన మొక్కలపైకి పాకిన మిరియాల పంటల సాగుపై ఆరా తీశారు. వంతెనపై ఏర్పాటు చేసిన ట్రీడెక్స్, పక్షి గూడు ఆకారంలో ఏర్పాటు చేసిన బర్డ్ నెస్ట్ లను ఆసక్తిగా తిలకిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు.
ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. ఎకో టూరిజం అభివృద్ధికి అటవీశాఖ అధికారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. కాఫీ తోటల అభివృద్ధి, ఎకో టూరిజం అభివృద్ధికి సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అరకు డిలైట్ కాఫీ బ్రాండ్ ప్రోమోషన్ తో పాటు సుంకరమెట్ట ఎకో టూరిజం పోస్టర్లు, బ్రోచర్లను శ్రీ పవన్ కళ్యాణ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ కజూరియా, విశాఖ రీజన్ ఫారెస్ట్ చీఫ్ కర్జర్వేటర్ డాక్టర్ జ్యోతి తుల్లిమెల్లి, జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్, గ్రామ సర్పంచ్ శ్రీ గెమ్మిలి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.