తెలంగాణలో మండుతోన్న ఎండలు.. మార్చిలోనే 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతల నమోదు

హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేశామన్నారు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున మరో 7 జిల్లాల్లోనూ శనివారం నుంచి ఎల్లో హెచ్చరికలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
Scroll to Top