ఆంధ్రప్రదేశ్ లో వేసవి పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పతాక స్దాయికి చేరుకుంటున్నాయి. పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 150కి పైగా మండలాల్లో ఇవాళ 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. వడగాల్పుల ప్రభావం దాదాపు అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
వడగాల్పుల ప్రభావం రాష్ట్రంపై అంతకంతకూ ఎక్కువవుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు భయపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొమరోలుతో పాటు నంద్యాల, కమలాపురంలో ఇవాళ గరిష్టంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. అలాగే ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాల్లో 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది.